తమిళ హీరో విశాల్‌కు హఠాత్ అస్వస్థత – కార్యక్రమం మధ్యలో స్పృహ కోల్పోయిన కలకలం
తమిళ సినిమా నటుడు విశాల్ అనారోగ్యానికి గురై ఒక కార్యక్రమంలో స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటన ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులందరినీ ఆందోళనకు గురి చేసింది.
ఈ సంఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఆదివారం జరిగింది. అక్కడ జరుగుతున్న మిస్ కువాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాల్ హాజరయ్యారు. స్టేజ్‌పై మాట్లాడుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి కిందపడిపోయారు. వెంటనే నిర్వాహకులు, మాజీ మంత్రి పొన్ముడి సహా ఆయన టీమ్ సభ్యులు అప్రమత్తమై ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం విశాల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయన మేనేజర్ హరి మాట్లాడుతూ – విశాల్ ఉదయం నుంచి భోజనం చేయకపోవడం వల్ల అలసటతో స్పృహ తప్పి ఉండొచ్చని అన్నారు. గతంలో కూడా జనవరిలో విశాల్ డెంగ్యూ జ్వరంతో బాధపడ్డారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు బలహీనతతో ఇబ్బంది పడుతున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా పాకిపోతున్నాయి. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “మా హీరో ఆరోగ్యంగా ఉండాలి… విశ్రాంతి తీసుకోవాలి” అంటూ ప్రార్థనలు చేస్తున్నారు.
ప్రస్తుతం విశాల్ ‘తుప్పరివాలన్ – 2’ (తెలుగులో డిటెక్టివ్ 2) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఇటీవల ‘మద గజ రాజా’ అనే సినిమాలో కూడా కనిపించారు. విశాల్ త్వరగా కోలుకొని తిరిగి షూటింగ్లో పాల్గొనాలని అందరూ కోరుకుంటున్నారు.