తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవిస్తాను – కమల్ కూతురు శృతి హాసన్
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనదైన గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ మళ్లీ ఒకసారి తన స్పష్టమైన మాటలతో అందరినీ ఆకర్షిస్తోంది. కమల్ హాసన్, సారికల కుమార్తెగా జన్మించిన శృతి, సినీ రంగంలో ఓ స్థానం సంపాదించడమే కాకుండా, వ్యక్తిగత విషయాల గురించి కూడా ఎటువంటి సందేహం లేకుండా మాట్లాడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంది.
తాజాగా ఆమె తన తల్లిదండ్రుల విడాకులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. “నా తల్లిదండ్రులు చిన్నపుడే విడిపోయారు. అది నన్ను బాధపెట్టలేదు. కలిసి ఉండి పరస్పర బాధలు ఎదుర్కోవడం కంటే, విడిగా ప్రశాంతంగా ఉండటం మంచిదే అని నాకు అప్పుడే అర్థమైంది,” అని చెప్పింది శృతి.
శృతి హాసన్ మాట్లాడుతూ, “అమ్మ సారిక జీవితాన్ని మళ్లీ నడిపిన తీరు నాకు గొప్ప ప్రేరణ. ఆర్థికంగా, మానసికంగా స్వతంత్రంగా ఉండటం ఆమెను చూస్తే నేర్చుకోవచ్చు. ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం నాకు జీవితంలో చాలా మార్గనిర్దేశం చేసింది,” అని అభిప్రాయపడింది.
విడాకులు వారి వ్యక్తిగత నిర్ణయం అని స్పష్టం చేసిన శృతి, తాను తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక ఇద్దరితోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఆమె తరచూ తన తండ్రితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ, తన ప్రేమను చూపిస్తూ ఉంటుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే, శృతి ప్రస్తుతం సలార్ 2 చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మొదటి భాగం భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. అంతేగాక, ఆమె తండ్రి నటించిన తగ్ లైఫ్ సినిమాలో ఓ పాటను కూడా పాడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.