రామ్ కొత్త సినిమా టైటిల్ “ఆంధ్ర కింగ్ తాలూకా”పై వివాదం
హీరో రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా “ఆంధ్ర కింగ్ తాలూకా” టైటిల్‌ను ప్రకటించారు. ఈ టైటిల్‌తో పాటు సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే, ఈ టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ పాత్ర ఉపేంద్ర అభిమానిగా ఉండనుందని తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. దర్శకుడు మహేష్ బాబు.పి, “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమాతో పేరుపొందిన దర్శకుడు, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా ఒక లవ్ స్టోరీతో పాటు ఫ్యాన్స్ నేపథ్య కథతో రూపొందుతున్నట్టు సమాచారం. అయితే “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే టైటిల్ చూసిన కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, పవన్ గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత “పిఠాపురం తాలూకా” అనే పేరుతో వారు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు రామ్ సినిమా టైటిల్ ఆ పేరు నుంచే ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు నెటిజన్లు భావిస్తున్నారు.
కొంతమంది నెటిజన్లు, ఉపేంద్ర పాత్రను తప్పుగా చూపిస్తే లేదా టైటిల్ ద్వారా పవన్ అభిమానులను బాధపెట్టేలా ఏదైనా ఉంటే, రామ్‌కు పెద్ద వ్యతిరేకత రావొచ్చని హెచ్చరిస్తున్నారు. “తేడా అయితే వాచిపోద్ది” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మొదటి గ్లింప్స్‌తోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఒకవైపు వివాదం, మరోవైపు అసలు కథ ఏంటో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువవుతోంది. ఇప్పుడు రామ్ ఈ రిస్కీ టైటిల్‌తో సినిమా ద్వారా ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.